జగన్ పతివ్రతలా మాట్లాడుతున్నారు: చంద్రబాబు

  • ఒక వ్యక్తిని దృష్టిలో పెట్టుకుని పోలవరం ప్రాజెక్టును ఆపేశారు
  • వైసీపీ విధ్వంసకర చర్యల వల్లే ప్రాజెక్టు ఆగిపోయింది
  • మీడియా కూడా ఈ టెర్రరిస్ట్ ప్రభుత్వాన్ని చూసి భయపడుతోంది
వైసీపీ విధ్వంసకర చర్యల వల్లే పోలవరం ప్రాజెక్టు ఆగిపోయిందని టీడీపీ అధినేత చంద్రబాబు విమర్శించారు. పోలవరం ప్రాజెక్టు ఆంధ్రుల కల అని... ఏ ఒక్కరినీ సంప్రదించకుండా ప్రాజెక్టు నిర్మాణాన్ని ఆపివేశారని మండిపడ్డారు. ఒక వ్యక్తిని దృష్టిలో పెట్టుకుని ప్రాజెక్టును ఆపేశారని అన్నారు. ఇంత భారీ ప్రాజెక్టులు దేశ చరిత్రలో ఎప్పుడూ రివర్స్ టెండరింగ్ కు పోలేదని చెప్పారు. ఇది రివర్స్ టెండరింగ్ కాదని... రిజర్వ్ టెండరింగ్ అని ధ్వజమెత్తారు. సీఎం బంధువు పీటర్ ఇచ్చిన నివేదిక ఆధారంగా ముందుకు వెళ్తున్నారని విమర్శించారు.

కేంద్ర ప్రభుత్వం చెప్పినా, నిపుణులు హెచ్చరించినా వినకుండా జగన్ ప్రభుత్వం ముందుకు సాగుతోందని చంద్రబాబు అన్నారు. పోలవరం ప్రాజెక్టును నిర్మించడం... మా ఇంటికి నోటీసులు అందించినంత ఈజీ అనుకుంటున్నారని ఎద్దేవా చేశారు. మరో ఏడాది కష్టపడి ఉంటే పోలవరం పూర్తయ్యేదని అన్నారు. పోలవరంపై మంత్రులు రోజుకో మాట మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ ఒక పతివ్రతలా, నీతిమంతుడిలా మాట్లాడుతున్నారని... ఇప్పటి వరకు పనిచేసిన ముఖ్యమంత్రులంతా తెలివిలేని వారా? అని మండిపడ్డారు. గోదావరిలో బోటు మునిగిపోతే కనిపెట్టలేనివారు... రివర్స్ టెండరింగ్ గురించి మాట్లాడుతున్నారని విమర్శించారు. మీడియా కూడా ఈ టెర్రరిస్ట్ ప్రభుత్వాన్ని చూసి భయపడుతోందని అన్నారు.
Go Back to Shorts
Jagan
Chandrababu
Polavaram
Telugudesam
YSRCP

More Telugu News